Army Officer Kidnapped In Manipur : మణిపుర్‌లో మరో సైనికాధికారి అపహరణకు గురవడం తీవ్ర కలకలం రేపింది. సైన్యంలో జూనియర్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కోన్సామ్ ఖేడాసింగ్‌ను శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు, ఆయన ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు జాతీయ రహదారిపై చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాయి. దీంతో సాయంత్రం ఆయనను రక్షించాయి భద్రతా దళాలు. బాధితుడు సెలవులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, అపహరణకు గల కారణం ఇంకా తెలియరాలేదు. గతంలో డబ్బు డిమాండ్ చేస్తూ అతడికి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
వరుసగా అధికారుల కిడ్నాప్
కొంతకాలంగా రాష్ట్రానికి చెందిన పోలీసు, సైనికాధికారులు, వారి కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని స్థానికులు చెప్పారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కాగా, నాలుగు నెలల వ్యవధిలో ఇది నాలుగోది. గతేడాది సెప్టెంబరులో అసోం రైఫిల్స్‌కు చెందిన సైనికుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సైనికుడి కుటుంబంలో నలుగురు వ్యక్తులను అపహరించి, హత్య చేశారు దుండగులు. గత నెలలో పశ్చిమ ఇంఫాల్‌లో అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ను అరంబై టెంగోల్ వర్గం వారు కిడ్నాప్ చేయగా, భద్రతా బలగాలు సకాలంలో స్పందించి ఆయన్ను రక్షించాయి.
ఇప్పటివరకు 219 మంది మృతి
ఏడాది కాలంగా జాతుల మధ్య వైరంతో మణిపుర్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి. మైతేయ్‌లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని గతేడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదన చేసింది. అయితే, వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని నాగా, కుకీ-జొమీ తెగలు డిమాండ్ చేశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. శాంతిభద్రతలు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా, ఏదో ఒకచోట ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లోయప్రాంతాల్లో సంఘ విద్రోహశక్తులను అదుపు చేయడం భద్రతా బలగాలకు సవాల్‌గా మారినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ హింసలో సుమారు 219 మంది మరణించారు.