Amit Shah On CAA : సార్వత్రిక ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సంబంధిత నిబంధనలు రూపొందించిన వెంటనే CAA అమల్లోకి వస్తుందన్నారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ ముస్లిం సోదరులను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారనీ, రెచ్చగొడుతున్నారని వివరించిన అమిత్‌షా, ఈ చట్టం వల్ల వారికి ఏ నష్టం జరగదని భరోసా ఇచ్చారు.
పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లలో వివక్ష ఎదుర్కొని భారత్‌కు వచ్చిన వర్గాలకే భారత పౌరసత్వం ఇస్తామనీ, అంతేకానీ ఇక్కడి వారి పౌరసత్వాన్ని లాక్కోవడం యూసీసీ చట్టం ఉద్దేశం కాదని అమిత్ షా వివరించారు. ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇతర రాజ్యాంగ నిర్మాతల ఎజెండా అని హోంమంత్రి తెలిపారు. బుజ్జగింపు రాజకీయాలతో ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పనను కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో CAA అమలుకు ఆమోదం లభించడమనేది సామాజిక మార్పునకు నిదర్శనమని అమిత్‌షా వివరించారు. లౌకిక దేశమైన భారత్‌లో మతాధారిత పౌరస్మృతులు ఉండకూడదని షా నొక్కిచెప్పారు.
"2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. అంతటా కుంభకోణాలే. విదేశీ పెట్టుబడులు రావడం లేదు. అప్పుడే శ్వేతపత్రం తెచ్చి ఉంటే ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేది. ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. అవినీతి లేదు. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి. అందుకే ఈ పత్రాన్ని తీసుకురావడానికి ఇదే సరైన తరుణం"
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఇక సార్వత్రిక ఎన్నికల గురించి చెప్పిన అమిత్‌షా, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు గానూ ప్రజలు బీజేపీకి 370, మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు కట్టబెడతారని జోస్యం చెప్పారు. 1947లో దేశ విభజనకు కారణమైన గాంధీ, నెహ్రూ వంశస్థులు భారత్ జోడో యాత్రలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. ఓబీసీలకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని, కాకా కాలేఖర్, మండల్ కమిషన్ నివేదికలను ఏళ్ల పాటు అమలు చేయకుండా ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని ఎద్దెవా చేశారు.
రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD), శిరోమణి అకాలీదళ్ (SAD) వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అని ప్రశ్నించగా, 'మేం ఫ్యామిలీ ప్లానింగ్‌ను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదు' అని సమాధానమిచ్చారు. మరిన్ని పార్టీలు ఎన్డీయేలో చేరతాయని పరోక్షంగా వెల్లడించారు. రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్లపాటు నమ్మారని, బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ కల ఆలస్యమైందన్నారు.