AK Antony Son In Lok Sabha Polls : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన తన కుమారుడు అనిల్ ఆంటోనీ ఓడిపోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అన్నారు. కేరళలోని పతనంతిట్ట లోక్ సభ స్థానం నుంచి అనిల్ ఆంటోనీ పోటీ చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంటో ఆంటోనీ బరిలో ఉన్నారు. 'నా కుమారుడి పార్టీ ఓడిపోవాలి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి గెలివాలి. కాంగ్రెస్ నా మతం. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీలో చేరడం కూడా తప్పే' అని ఏకే ఆంటోనీ అన్నారు.
బీబీబీ డాక్యుమెంటరీ వల్లే రాజీనామా
అనిల్ ఆంటోనీ గతేడాది ఏప్రిల్‌లోనే బీజేపీలో చేరారు. బీజేపీలోకి చేరకముందు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ కో- ఆర్డినేటర్‌గా కొనసాగారు. 2002 గుజరాత్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వ్యవహారంతో విభేదించి పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 6న అనిల్ బీజేపీలో చేరారు. తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ వచ్చిన ఒత్తిడి వల్లే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు అనిల్ తెలిపారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు ఓ కుటుంబం కోసం పని చేయడమే తమ కర్తవ్యమని భావిస్తారని, కానీ ప్రజల కోసం పనిచేయాలని తాను నమ్ముతున్నట్లు అనిల్ ఆంటోనీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే విషయంలో ప్రధాని మోదీకి స్పష్టమైన విజన్ ఉందని బీజేపీలో చేరినప్పుడు వ్యాఖ్యానించారు.
తండ్రికే ద్రోహం
ఆ సమయంలో ఏకే ఆంటోనీ తన కుమారుడు బీజేపీలోకి చేరడం తప్పుడు నిర్ణయమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తనును ఎంతగానో బాధించిందని తెలిపారు. 2014 తర్వాత మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఐక్యత, మత సామరస్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని ఏకే ఆంటోనీ మండిపడ్డారు. ఆ సమయంలోనే అనిల్ ఆంటోనీ తండ్రికే ద్రోహం చేశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
పండగ పూట విషాదం- లోయలో వాహనం పడి 8మంది మృతి - Uttarakhand Road Accident