AI Magical Chair : సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల తర్వాత ప్రజలకు చేసిన వాగ్దానాలను మరచిపోతారు. అయితే ఎవరైనా పక్కనుండి ఆ విషయాన్ని గుర్తు చేస్తే ఎలా ఉంటుంది. నేతలకు కాస్త ఇబ్బందిగా ఉండవచ్చేమో గానీ ప్రజలకు మాత్రం చాలా నచ్చుతుంది కదా. ఇలాంటి ప్రయత్నమే చేశారు గోరఖ్‌పుర్ ఐటీఎం ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు. ఈ మ్యాజికల్ చైర్‌పై నేతలు కూర్చోగానే- ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు గుర్తుకు వస్తాయి.
వాగ్దానాలు గుర్తుచేస్తుంది
ITM కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కంప్యూటర్ డేటా సైన్స్ విద్యార్ధులు అన్షిత్ శ్రీవాస్తవ, ప్రణవ్ శర్మ, మన్వేంద్ర త్రిపాఠి, రాజకీయ నాయకులకు తల తిరిగిపోయేలా ఓ "AI కుర్చీ"ని తయారు చేశారు. నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, ప్రజలకు వచ్చిన ఆగ్రహాన్ని వారికి తెలిసేలా చేస్తుంది ఈ కుర్చీ. రాజకీయ నాయకులందరినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ 'ఏఐ చైర్'లో ఎన్నో విశేషాలు ఉన్నాయని దీనిని రూపొందించిన విద్యార్థి ప్రణవ్ శర్మ చెప్పాడు. 'ఉపాధి, విద్య, మహిళలు, రోడ్డు భద్రత, డ్రైనేజీ తదితర సమస్యలపై ప్రజలకు చేసిన వాగ్దానాలను ఈ కుర్చీ గుర్తు చేయడమే కాకుండా వీటిని నెరవేర్చకపోతే ప్రజలకు వచ్చిన ఆగ్రహాన్ని కూడా తెలియచేస్తుంది. ఈ కుర్చీ సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతుంది. అందులో ప్రజాప్రతినిధులకు సంబంధించి మంచి లేదా చెడు గురించి ప్రజలు ఇచ్చిన అభిప్రాయాన్ని బట్టి ఈ కుర్చీలో ఏర్పాటు చేసిన రెడ్, గ్రీన్ లైట్ ఇండికేటర్‌ల ద్వారా నేతల పనితీరును అంచనా వేస్తామని ప్రణవ్ తెలిపాడు.
ఇలా పనిచేస్తుంది!
"ఈ కుర్చీపై సెన్సార్లు అమర్చాము. PM-CM లేదా మరే ఇతర నాయకుడు కూర్చున్నా కుర్చీ గుర్తిస్తుంది. తాము చేసే పనులను ఎంతమంది ఇష్టపడుతున్నారో, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారో ఈ నేతలకు తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో లైక్‌ల సంఖ్య లక్షలకు చేరుకున్న తర్వాత, ఈ AI చైర్ యాక్టివేట్ అవుతుంది. కుర్చీపై కూర్చున్న వ్యక్తికి తనకున్న ప్రజాదరణ గురించి కూడా తెలుస్తుంది. అలాగే ప్రజల అసంతృప్తిని సైతం ఈ కుర్చీ బయట పెడుతుంది. ఈ కుర్చీ కోసం ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ఎరుపు, ఆకుపచ్చ సూచికలు, కేబుల్, ఫైబర్ కుర్చీ, PCB బోర్డు, బ్యాటరీ మొదలైనవి ఉపయోగించాము." అని దీన్ని రూపొందించిన విద్యార్థులు తెలిపారు.
కేవలం 15 రోజుల్లోనే తయారీ
ఈ ఏఐ చైర్ భవిష్యత్తులో మరింత స్మార్ట్‌గా మారనుందని గోరఖ్‌పుర్‌లోని మదన్ మోహన్ మాల్వియా టెక్నలాజికల్ యూనివర్శిటీ డైరెక్టర్ ఎన్‌కే సింగ్ అభిప్రాయ పడ్డారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. తమ విద్యార్ధులు 35 వేలు వెచ్చించి కేవలం 15 రోజుల్లోనే దీనిని సిద్ధం చేశారని, ప్రజాప్రతినిధులకు తమ విధులను గుర్తు చేసే ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన విద్యార్థుల కృషిని ప్రశంసించారు.
'మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు ఇచ్చా'- నేరం అంగీకరించిన దర్శన్! - Darshan Renuka Swamy