Actors In Lok Sabha Polls 2024 : లోక్‌సభ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు పలువురు సినీతారలకూ ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇప్పటికే హేమమాలిని, శతృఘన్ సిన్హా వంటి. అలనాటి మేటి నటులు రాజకీయాల్లో రాణిస్తుండగా ఈ ఎన్నికల్లో తర్వాతి తరం నటులు చాలామంది పోటీకి దిగారు. వారిలో ఎక్కువమంది కేంద్రంలో అధికార బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో సీనియర్ నటి రాధిక ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన రాధిక, దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
విరుధ్‌నగర్ బరిలో బీజేపీ తరఫున!
ప్రముఖ నటుడు శరత్ కుమార్‌ను వివాహం చేసుకున్న ఆమె, రడాన్ మీడియా వర్క్స్ ను ప్రారంభించి నిర్మాత అవతారం ఎత్తారు. రాజకీయంగానూ తమిళనాట DMK, AIADMK పార్టీల్లో పనిచేశారు. గతంలో శరత్‌కుమార్ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల బీజేపీలో విలీనం చేశారు. తాజాగా తన భార్య రాధికను తమిళనాడులోని విరుధ్‌నగర్ బరిలో బీజేపీ తరఫున పోటీకి నిలిపారు.
మాలీవుడ్ యాక్టర్లు కూడా!
పలువురు మలయాళం నటులు కూడా తాజా ఎన్నికల్లో సందడి చేస్తున్నారు. సీనియర్ నటుడు సురేశ్ గోపీ కేరళలోని త్రిసూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ త్రిసూర్ నుంచి పోటీ చేసినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. 2017 నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన సురేశ్ గోపీ గాయకుడిగా, టీవీ వ్యాఖ్యాతగా కూడా రాణించారు.
ముకేశ్ మాధవన్ కొల్లాం నుంచి!
మరో మలయాళం స్టార్ కృష్ణకుమార్ కోల్లాం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ మండలి సభ్యుడిగా ఉన్న ఆయన, మలయాళం, తమిళ చిత్రాల్లో అలరించారు. గతంలో ఆల్ఇండియా రేడియా, దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గానూ పనిచేశారు. మరో మలయాళం నటుడు ముకేశ్ మాధవన్ కొల్లాం నుంచి CPM తరఫున పోటీ చేయనున్నారు. ప్రస్తుతం MLAగా ఉన్న ఆయన, పలు మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు. సినీ నిర్మాత, టీవీ వ్యాఖ్యాతగా కూడా రాణించారు.
బీటౌన్‌లో చాలా మంది!
బాలీవుడ్‌లోనూ పెద్దసంఖ్యలో నటీనటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. వందలాది చిత్రాల్లో నటించి, బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు శత్రుఘన్ సిన్హా ప్రస్తుతం బంగాల్లోని అసన్‌సోల్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. 1996లోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన శత్రుఘన్, 2008 వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2003-2004 మధ్య వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పని చేశారు. 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని పట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 2019లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన సిన్హా, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ తరఫున అసన్‌సోల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి అక్కడి నుంచే బరిలో నిలిచారు.
ఎన్నికల రణక్షేత్రంలో బాలీవుడ్ డ్రీమ్ గార్ల్!
అలనాటి మేటి నటి, దర్శకురాలు, నిర్మాత కూడా అయిన హేమమాలిని బీజేపీలో చాలాకాలంగా పనిచేస్తున్నారు. 2014 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ఎంపీగా గెలుస్తున్న ఆమె, తాజా ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 1999లో సీనియర్ నటుడు వినోద్ ఖన్నా పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌లో బీజేపీ తరఫున పోటీచేయగా ఆయన గెలుపు కోసం హేమమాలిని ప్రచారం చేశారు. 2003 నుంచి 2009 వరకూ బీజేపీ క్రియాశీలక నేతగా ఉన్న హేమమాలిని 2011లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1963లో తమిళ చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన హేమమాలిని అద్భుత నటనతో బాలీవుడ్‌లో డ్రీమ్ గాళ్‌గా స్థిరపడ్డారు. వందలాది హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన హేమ, సీనియర్ నటుడు ధర్మేంద్రను వివాహం చేసుకున్నారు.
గోవింద రీఎంట్రీ
సీనియర్ బాలీవుడ్ నటుడు గోవింద మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన, 2004-2009 మధ్య లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. తర్వాతరాజకీయాలకు దూరంగా ఉన్న గోవింద ఇటీవల శివసేన శిందే వర్గంలో చేరారు. తాజా ఎన్నికల్లో వాయవ్య ముంబయి స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బాలీవుడ్‌లో గొప్ప హాస్యనటుడిగా పేరొందిన గోవింద, 165 హిందీ సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
టీవీ రాముడు సైతం!
1980వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ధారావాహికలో రాముడి పాత్రధారిగా సుపరిచితమైన అరుణ్ గోవిల్ కూడా ఈసారి ఎన్నికల బరిలోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ నుంచి బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. 1977నుంచి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన, అనేక ధారావాహికల్లోనూ అలరించారు. యూపీలో రామమందిర ప్రారంభం తర్వాత అరుణ్ గోవిల్‌ను రాజకీయ తెరపై అరంగేట్రం చేయించిన బీజేపీ రఠ్ బరిలో నిలిపింది.
ఫైర్ బ్రాండ్ స్పెషల్ అట్రాక్షన్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొద్దికాలంగా బీజేపీ మద్దతుదారుగా ఉన్న ఆమె, ఇటీవల అధికారికంగా ఆ పార్టీలో చేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. బాలీవుడ్‌లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన కంగన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్‌గా ఉండే నటిగానూ ప్రసిద్ధి చెందారు. ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
రేసుగుర్రం విలన్ సై
మరో భోజ్‌పురి నటుడు మనోజ్‌తివారీ కూడా బీజేపీ తరఫున ఈశాన్య దిల్లీ ఎంపీగా 2014 నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో పోటిచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిన ఆయన 2016లో దిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరి వీరందరూ గెలుస్తారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">