AAP MP Swati Maliwal : మద్యం కుంభకోణం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఆమ్‌ఆద్మీపార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్ రాజ్యసభ ఎంపీ, దిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతీ మాలీవాల్ సోమవారం ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు తనపై దాడి చేశారంటూ ఆమె చెప్పుకొచ్చినట్లు సమాచారం. అందుకు సీఎం నివాసమే వేదిక కావడం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అసలేం జరిగిందంటే ?
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ముఖ్యమంత్రి నివాసం నుంచి ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారంటూ స్వాతి వాళ్లకు ఫోన్‌లో చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం సూచన మేరకే ఈ దాడి జరిగిందంటూ ఆమె పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయం విని పోలీసులు సివిల్ లైన్స్‌లో ఉన్న సీఎం నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఆమె కనిపించలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత స్టేషన్‌కు వచ్చిన ఆమె, తర్వాత కంప్లైంట్ ఇస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే ఆమె దగ్గర నుంచి వారికి రెండు సార్లు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, స్వాతీ మాలీవాల్‌పై దాడి వార్తలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దిల్లీ సీఎం సహాయకుడు స్వాతీ మాలీవాల్‌పై దాడి చేశారని ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి పోలీసులకు కాల్ వెళ్లిందని, కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతీ మాలీవాల్ ఎందుకు మౌనం వహించారో గుర్తుకువస్తుందా అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో ఆమె భారత్‌లో లేరన్న అమిత్ మాలవీయ, చాలా రోజుల పాటు స్వదేశానికి తిరిగి రాలేదని గుర్తుచేశారు.
అయితే ఇటీవల కాలంలో బిభవ్ కుమార్ వార్తల్లో నిలిచారు. ఆయన నియామకం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సీఎం వ్యక్తిగత కార్యదర్శి హోదా నుంచి దిల్లీ విజిలెన్స్ విభాగం కుమార్‌ను తొలగించారు. అలాగే మద్యం కుంభకోణం కేసులోను ఈడీ ఆయనకు సమన్లు కూడా ఇచ్చింది.