Kumbh Mela 2025 Swami Sivananda : ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే ఆరు కోట్ల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మహాకుంభ నగర్‌కు చేరుకున్న పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ యోగా సాధకులు స్వామి శివానంద క్యాంపు వద్ద భక్తులు క్యూ కడుతున్నారు. దాదాపు 129 ఏళ్ల వయసు (ఆధార్ ఆధారంగా) ఉన్న ఆయన గడిచిన 100 ఏళ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యులు చెబుతున్నారు.
ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన స్వామి శివానంద సెక్టార్ 16లో క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపు బయట అతికించిన ఆధార్ కార్డు పోస్టర్‌పై ఆయన జన్మదినం ఆగస్టు 8, 1896గా పేర్కొన్నారు. ఉదయాన్నే ధ్యానం చేస్తుండగా, ఆయన దర్శనం కోసం క్యాంపు బయట భక్తులు క్యూ కట్టారు. బెంగళూరు నుంచి వచ్చిన ఓ శిష్యుడు శివానంద గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
"స్వామి ఓ పేద కుటుంబంలో జన్మించారు. కనీసం ఆహారం లభిస్తుందన్న ఆశతో గ్రామానికి వచ్చే సాధువులకు అప్పగించాలని ఆయన తల్లిదండ్రులు భావించారు. ఆయనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓంకారానంద గోస్వామికి అప్పగించారు. రెండేళ్ల తర్వాత కుటుంబీకులను చూసేందుకు వచ్చేసరికి అతడి సోదరి చనిపోయింది. మరో వారం వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ఒంటరిగా మిగిలిపోయారు. నాలుగేళ్ల వరకు ఎప్పుడూ పాలు, పండ్ల రుచి కూడా చూడలేదట. ఆనాటి పరిస్థితులే స్వామి ప్రస్తుత జీవనశైలికి మార్చాయి’’ అని బెంగళూరు భక్తుడు మీడియాకు వివరించాడు.
"స్వామి ఎటువంటి విరాళాలు స్వీకరించరు. ఎటువంటి కోరికలు లేవు. ఏ జబ్బూ లేదు. నూనె, ఉప్పు వంటివి లేకుండా ఉడికించిన ఆహారం మాత్రమే తింటారు. పాల పదార్థాలు కూడా ముట్టరు. రాత్రి తొమ్మిదింటికి పడుకొని ఉదయం మూడు గంటలకే మేల్కొంటారు" అని మరో భక్తుడు చెప్పాడు. యోగా సాధకుడిగా ఉన్న ఆయన్ను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించిందని మరో భక్తుడు పేర్కొన్నాడు. "ఉదయాన్నే లేచి యోగా కోసం కనీసం అరగంట కేటాయించండి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి నడక ఎంతో అవసరం" అని నేటి యువతకు స్వామి శివానంద సందేశం ఇస్తున్నారు.
అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన స్వామి శివానందను భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీతో సత్కరించింది. నిరాడంబర జీవితం గడుపుతూ యోగ, ధ్యానంలో విశేష సేవలందించినందుకు గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు పేర్కొంది. ఆ సమయంలో ఆయన వయసు 125 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.