100 Days Agenda New Government : ఓ వైపు దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు జూన్ 4న కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వానికి 100 రోజుల ఎజెండాను ఖరారు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. తొలి కేబినెట్ సమావేశంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు, ప్రాజెక్టులను ఖరారు చేసేందుకు 10 వేర్వేరు మంత్రిత్వశాఖల సెక్రటరీలు పనిచేస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ తదితర మంత్రిత్వ శాఖల సెక్రెటరీల బృందాలు చురుగ్గా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
అయితే లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆ సమావేశంలో మంత్రులకు మోదీ పలు సూచనలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి 100 రోజులతో పాటు తదుపరి ఐదేళ్ల పాటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణను రూపొందించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇందుకోసం ఆయా మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాలన్నారు.
100రోజుల ప్లాన్‌లో 'ఇండియా ఏఐ మిషన్'!
అయితే కొన్ని అంశాలకు సంబంధించి నిర్ణయాలు ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారం చేపట్టిన 'తొలి 100 రోజుల ప్రణాళిక'లో భాగంగా 'ఇండియా ఏఐ మిషన్'ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం. దీని కింద 2024-25 ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించొచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ 'ఇన్ఫామిస్ట్' తన కథనంలో పేర్కొంది. అయిదేళ్ల కాలానికి కృత్రిమ మేధ(ఏఐ) వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.10,300 కోట్ల కేటాయింపునకు మార్చిలో మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. జులైలో ప్రవేశపెట్టబోయే పూర్తి స్థాయి(2024-25) బడ్జెట్‌లో 'ఇండియా ఏఐ మిషన్'కు నిధుల కేటాయింపు జరిగే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు.
తాను మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని, దేశం ప్రజల సంక్షేమం కోసం మరిన్ని పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వివిధ రంగాల్లో సంస్కరణలు చేపడతామని వెల్లడించారు. అందులో భాగంగా రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొత్త థియేటర్ కమాండ్లను రూపొందిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
శివయ్య దర్శనం- 4గంటలపాటు రోడ్ షో- మోదీ నామినేషన్‌కు భారీ ఏర్పాట్లు - Lok Sabha Elections 2024