Bus Accident In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. ఆదివారం బులంద్‌షహర్ జిల్లాలో సేలంపుర్ ప్రాంతంలో బదాయూ - మీరట్ రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందినట్లు జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు. మరో 27 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో నలుగురిని మీరట్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు.
"పికప్ ట్రక్ ఘజియాబాద్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ సరైన రూట్లోనే వస్తుంది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడు. రహదారిపై బస్సును ఒక్కసారిగా తిప్పడం వల్ల బస్సు ట్రక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చాలా మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన తరువాత చాలాసేపటికి అంబులెన్స్ ఇక్కడికి చేరుకుంది. ఘటన జరిగిన చాలాసేపటి తరువాత పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీసుల నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తుంది" అని గ్రామస్థులు ఆరోపించారు.
బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం
ఎస్పీ శ్లోక్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రోడ్డుపై నియంత్రణ లేకుండా వాహనాలు అతివేగంతో వెళ్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను తమకు అప్పగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదం అని పేర్కొన్నారు.
ప్రమాద ఘటనపై స్పందించిన ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి
ట్రక్‌ను బస్సు ఢీకొట్టిన ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.