రుణమాఫీ, రైతు అంశాలపై బీఆర్ఎస్ ఫోకస్ - రెండ్రోజుల్లో కార్యాచరణ
Published : Aug 30, 2024, 11:32 AM IST
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి రుణమాఫీ కాని వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తోంది. అర్హులైన అన్నదాతలందరికీ అప్పులు మాఫీ చేయాలన్న డిమాండ్‌తో ఇటీవల రైతు దీక్షలు చేసిన గులాబీ పార్టీ వాటికి కొనసాగింపుగా కార్యక్రమాలు చేపట్టనుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతు ఐక్య కార్యాచరణ సమితి రుణమాఫీ అమలుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం యాప్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఆర్ఎస్ నాయకత్వం సమాలోచనలు జరుపుతోంది. ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ ఖరారు అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పాల్గొంటారని అంటున్నారు.