చైనాకు 'క్వాడ్' చురకలు- సముద్రంలో డ్రాగన్ వైఖరిపై ఆగ్రహం!
Published : Jul 29, 2024, 2:31 PM IST
QUAD Leaders On China: జపాన్ టోక్యోలో సమావేశమైన క్వాడ్ విదేశాంగ మంత్రులు చైనాపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. క్వాడ్ కూటమి దేశాలు ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించకూడదంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. క్వాడ్ కూటమిలోని ప్రతి దేశం ఇండో-పసిఫిక్‌లో స్వేచ్ఛ, సుస్థిరతను కాపాడుతుందని పునరుద్ఘాటించారు. స్వేచ్ఛ, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే దక్షిణ చైనా సముద్రంలో చైనా విన్యాసాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలకు క్వాడ్ దేశాలు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. అలాగే సీమాంతర ఉగ్రవాదాన్ని ఖండించారు. టోక్యోలో జరుగుతున్న క్వాడ్ దేశాల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికావా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ పాల్గొన్నారు.