మాకు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారంలో పాల్గొంటారా?- ఇంటికి వెళ్లి దాడి చేసిన వైసీపీ నేతలు - YSRCP Leaders Attack on TDP Workers - YSRCP LEADERS ATTACK ON TDP WORKERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 12:31 PM IST
YSRCP Leaders Attack on TDP Workers: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. ప్రతిపక్షాలపై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారని టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కర్నూలులో వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు.
నిర్మల్ నగర్‌కి చెందిన రామలింగం, సుభద్రమ్మ దంపతులు పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. దీంతో అదే కాలనీకి చెందిన వైసీపీ నాయకుడు రామాంజనేయులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి వైసీపీ వర్గీయులు రాంబాబు, కృష్ణయ్య, శివశంకర్ మారణాయుధాలతో వచ్చి తమపై దాడి చేశారని బాధితురాలు సుభద్రమ్మ తెలిపారు. ఆమె గట్టిగా అరవటంతో స్థానికులు రావటాన్ని గమనించిన వైసీపీ నేతలు పారిపోయారని అన్నారు. బాధితురాలు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు వాపోయారు.