ఫేస్బుక్లో పోస్ట్ - పదవి నుంచి తొలగించిన వైఎస్సార్సీపీ - satya sai district news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 10:31 PM IST
YSRCP Leader Fire on Hindupur New Incharge : వైఎస్సార్సీపీలో ఎన్నికలకు రెండు, మూడు నెలలు ముందు అభ్యర్థులను మార్చటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్యకర్తలు వాపోయారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో పట్టణ ఏ బ్లాక్ కన్వీనర్‌గా ఉన్న వైఎస్సార్సీపీ నేత సాదిక్ తన ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాదిక్ మాట్లాడుతూ, గత నెల మంత్రి పెద్దిరెడ్డి కార్యక్రమానికి వచ్చి ఖలీల్ అనే కార్యకర్త స్పృహ తప్పి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఖలీల్ కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ నేతలను కోరినా ఏ ఒక్కరూ స్పందించలేదు. దీంతో ఆవేదన చెంది ఫేస్బుక్లో పోస్టు పెట్టానని సాదిక్ తెలిపాడు.
పోస్ట్ పెట్టడం కారణంగా హిందూపురం సమన్వయకర్త దీపికా రెడ్డి తనను పట్టణ ఏ బ్లాక్ కన్వీనర్ పదవి నుంచి తప్పించారని వాపోయారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు ? ఎన్నికలు దగ్గర పడినప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్‌లను మార్చటం వల్లే తాను మోసపోయానని సాదిక్ వాపోయాడు. నేను పార్టీ కోసం పడ్డ కష్టం కొత్తగా వచ్చిన వారికి ఎలా తెలుస్తుందని మండిపడ్డారు. లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. చివరికి కొత్త వారు వచ్చి తనను పదవి నుంచి తప్పించటం దారుణమన్నారు. ఈ విషయాలను జగన్ గుర్తించాలని సాదిక్ కోరారు.