అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం - యర్రగుంట్లలో అధికార పార్టీ కౌన్సిలర్ల రాజీనామా - YSRCP councillors
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 4:43 PM IST
YSRCP Councillors Resign: అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా, వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయామంటూ వైఎస్ఆర్ కడప జిల్లా యర్రగుంట్ల మున్సిపాలిటీకి చెందిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పదవులకు రాజీనామా చేశారు. వైస్ ఛైర్మన్ సహా ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా పత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు. మున్సిపాలిటీ అధికారులు దొంగ బిల్లులు పెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీలో జురుగుతున్న అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 2023- 2024 బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, ముగ్గురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ వర్రా చంద్ర కళ, మోపూరి థెరీసా, భాస్కర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎర్రగుంట్ల మున్సిపాలిటీ కమిషనర్ రామకృష్ణయ్యకు అందజేశారు. కొంత మంది కౌన్సిలర్ల ఏకపక్ష నిర్ణయాలతో తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేయలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాలలో అధికారులకు, కౌన్సిలర్లకు మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. మునిసిపాలిటీ సిబ్బంది కౌన్సిలర్లకు మర్యాద ఇవ్వడం లేదని, మున్సిపాలిటీలో పనుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని కౌన్సిలర్ల ఆరోపించారు. చేసిన పనులకు దొంగ బిల్లులు పెట్టి డబ్బు తీసుకుంటున్నారంటూ కౌన్సిలర్లు పేర్కొన్నారు. అధికారుల తీరు నచ్చకే రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. వార్డులో అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు మెుహం చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కొంత మంది కౌన్సిలర్లకు మాత్రమే అనుకులంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులకు అనుకులంగా ఉన్నవారికి మాత్రమే అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.