Sanghamitra Animal Foundation by 7 Youngsters of Vijayawada to Serve Animals : ప్రస్తుత తరుణంలో సాటి మనుషులే పట్టించుకోని రోజులివి. అలాంటిది గాయపడిన వీధిశునకాలను తెచ్చి చికిత్స అందించి మళ్లీ తేరుకునేలా చేయడం సామాన్య విషయం కాదు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని "సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ సంస్థ" ఆ దిశగా సేవలందిస్తోంది. అందరి ప్రశంసలు పొందుతోంది. ఏడుగురు యువకులు పూర్తి సేవాభావంతో ఈ సంస్థను నిర్వహిస్తూ మూగజీవాలకు అండగా నిలుస్తున్నారు.
వాళ్లందరూ ఉన్నత చదువులు పూర్తి చేసిన యువకులు. బాధ్యత తెలిసిన మంచి మనసున్న మనుషులు. మూగజీవాలకు పట్ల ప్రేమతో ఒక్కటయ్యారు. "సంఘమిత్ర యూనిమల్ ఫౌండేషన్"ను ఏర్పాటు చేసి వేలాది జంతువుల్ని సంరక్షిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు.
అందరూ విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లి గ్రామంలో 75 సెంట్ల భూమి అద్దెకు తీసుకుని ఎన్జీవో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 110 శునకాలు వైద్యచికిత్సలు పొందుతున్నాయి.
'మనుషులకు ప్రమాదం జరిగితే చెప్పుకునే అవకాశం ఉంది. మూగజీవాలకు ఏదైనా జరిగితే ఎవరికి చెప్పుకుంటాయి.అందుకే ఉద్యోగం సైతం వదిలేసి మూగజీవాల సేవలో ఆనందంగా గడుపుతున్నాను.గాయపడిన కుక్కల్ని సంరక్షించడం ఆషామాషీ కాదు. ఇందుకు ఎంతో వ్యయ, ప్రయాసల కోర్చి శ్రమించాలి. దాతలు ఇచ్చిన విరాళాలతోనే సంస్థ నడుపుతున్నాం. కుక్కలకు ఆహారం, మందులు, సిబ్బంది జీతాలు, శస్త్రచికిత్సలకు నెలకు 7 లక్షల వరకు ఖర్చవుతోంది.' -రవికీర్తి, సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ సభ్యుడు
బాల్యం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి - స్కౌట్స్ అత్యుత్తమ శిక్షణ
ప్రాంగణంలో కొంత ప్రాంతాన్ని ఆస్పత్రిగా మార్చి కావాల్సిన మందులు, సెలైన్ బాటిళ్లు ఇతర వైద్యచికిత్సలు అందిస్తున్నారు. ఆలనాపాలనా నిర్వాహకులదే. కుక్కలకు సపర్యల కోసం 9మంది సిబ్బందిని పెట్టుకున్నారు. వీరికి నెలకు లక్షా 50 వేల రూపాయల దాకా జీతాలు చెల్లిస్తున్నారు.
గతంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా జంతుసంరక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకోగా 2002లో అందరూ కలసి సంస్థ ఏర్పాటు చేశారు. రోడ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల పక్కన గాయపడిన కుక్కల్ని చేరదీస్తున్నారు. వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారం అందుకొని వెంటనే అంబులెన్స్ ద్వారా కుక్కల్ని తీసుకొచ్చి చికిత్సలు అందిస్తారు.
తమ తల్లిదండ్రులు జంతువులపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని వారి స్ఫూర్తితో తాను కూడా శునకాల్ని సంరక్షిస్తున్నానని చెబుతోంది ఫౌండేషన్ సభ్యురాలు సింధూర. సొంతస్థలం ఏర్పాటు చేసుకొని మరిన్ని సేవలు అందిస్తామని వివరించింది. ఇప్పటివరకు 6వేలకు పైగా కుక్కలను సంరక్షించి చికిత్సలు అందించారు ఈ యువత.
ప్రపంచంలో విషం లేని పాములే ఎక్కువ - ప్రజల్లో అవగాహన పెంచుతున్న EGWS - Eastern Ghats Wildlife Society