Minister Payyavula Series On Rushikonda Palace Contractor Bill Payments : రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ? ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై ఆయన మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారులు వెల్లడించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు అధికారులు వివరించారు. వేరే బిల్లులైనా సరే ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని మంత్రి పయ్యావుల అసంతృప్తి వ్యక్తం చేశారు.
చెల్లింపులు జరిపితే పరిణామాలు : గతంలో ఓసారి చెప్పినా వినకుంటే ఎలా అంటూ మండిపడ్డారు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా? లేక సొంత నిర్ణయమా? అంటూ అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టరు చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకురాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్వత్రా చర్చనీయాంశం : రుషికొండలో ప్యాలెస్ నిర్మాణంలో సింహభాగం చేజిక్కించుకున్న డెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ ఇండియా సంస్థకు అధికారులు రూ. 60.96 కోట్ల బిల్లులు చెల్లించారు. విశాఖలోని వర్సిటీ పనులు, పులివెందులలోని వైద్య కళాశాలకు సంబంధించిన ఈ బిల్లులు చెల్లించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా గుత్తేదారులు బిల్లుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కోటి విలువ కన్నా తక్కువ చెల్లింపులను సైతం అందక విలవిల్లాడుతుంటే, జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఓ బడా గుత్తేదారు సంస్థ బిల్లులు చేజిక్కించుకోవడం విశేషం.
రుషికొండ ప్యాలెస్ నిర్మించిన కాంట్రాక్టర్కు రూ.61 కోట్లు చెల్లింపు
ప్రజలను మోసం చేసేందుకే రుషికొండ నిర్మాణాలు - ఈ దుర్మార్గం అందరూ చూడాలి: సీఎం చంద్రబాబు