కాంగ్రెస్ ప్రచారంలో వైసీపీ కార్యకర్త కవ్వింపు చర్యలు - షర్మిల ఘాటు సమాధానం - ysrcp activist in sharmila campaign
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 10:17 PM IST
YSRCP Activist in Sharmila Campaign: వైఎస్సార్ జిల్లా దువ్వూరులో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా జనంలోకి వచ్చిన వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన షర్మిల జగన్ రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలంటూ వైసీపీ కార్యకర్తలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తన వద్దకు వచ్చి మాట్లాడాలని చెప్పారు. వైసీపీ కార్యకర్త చంద్ర ఓబుల్ రెడ్డి షర్మిల వద్దకు వచ్చి జగన్కు అనుకూలంగా మాట్లాడారు.
వైసీపీ కార్యకర్త మాటలకు షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చారు. జగన్ జైల్లో ఉన్నపుడు తాను కూడా జై జగన్ అంటూ 3 వేల 200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల గుర్తు చేశారు. వైఎస్సార్ ఆశయాలను నిలబెడతారనుకుంటే, జగన్ మాట తప్పారని ధ్వజమెత్తారు. మద్య నిషేధం అన్నాడు చేశాడా, ప్రత్యేక హోదా తెస్తానన్నాడు తెచ్చాడా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. షర్మిల మాటలకు తోకముడిచిన వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు.