వేడుకల కోసం గుర్రానికి ట్రైనింగ్ - స్వారీ చేస్తుండగా కిందపడి యువకుడు మృతి - KURNOOL MAN DIED IN HORSE RIDING
Published : Jul 30, 2024, 9:40 AM IST
Man Died while Horse Riding in AP : సంప్రదాయంగా వస్తున్న వేడుకల్లో పాల్గొనేందుకు గుర్రానికి శిక్షణ ఇస్తూ ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని మద్దికేరలో ఏటా దసరా రోజు గుర్రపు పందాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో చిన్న నగరికి చెందిన కృష్ణమూర్తి, రామలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు పృథ్వీరాజ్ (29) గుర్రానికి శిక్షణ ఇచ్చే క్రమంలో మద్దికేర నుంచి బొజ్జనాయునిపేట గ్రామానికి గుర్రంపై వెళ్తుండగా అనుకోకుండా పడిపోయాడు.
ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ తలకు బలమైన గాయాలు కావడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితున్ని హూటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు గుర్రంపై నుంచి పడి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గతేడాది దసరా రోజున జరిగిన గుర్రాల ప్రమాదంలో వీరి కుటుంబానికి చెందిన మాణిక్య రాయుడు సైతం ప్రమాదానికి గురయ్యాడు. అతను ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పుడు అదే కుటుంబంలో మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.