తాగునీటి కోసం రాత్రిపూడ మహిళల ఆందోళన - రోడ్డుపై బైఠాయింపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 9:28 AM IST
Women Protest for Drinking Water: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండల కేంద్రంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, పథకాలు ఒట్టిపోయాయి. గ్రామంలో గత పది రోజులుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ రాత్రి వేళలో రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నాకు దిగారు. తాగడానికి నీళ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం రాత్రి మహిళలు టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో సుమారు రెండు గంటల పాటు బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తాగునీటిని వెంటనే సరఫరా చేయాలని నినాదాలు చేశారు. మండలంలో నీటి కొరత తీవ్రతరం కావటంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుంటే ప్రభుత్వం వాటిని కూడా నిలిపివేయడం దారుణమన్నారు. రెండు రోజుల్లో నీటి సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని స్థానికులు హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.