'20 రోజుల క్రితం ఉన్న ఓట్లు - ఇప్పుడెలా మిస్ అవుతాయి' - షేక్‌పేటలో పలువురి ఓట్లు గల్లంతు - Votes Missed in Shaikpet - VOTES MISSED IN SHAIKPET
Published : May 13, 2024, 1:36 PM IST
|Updated : May 13, 2024, 4:31 PM IST
Voters Vote Missed in Shaikpet : సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని షేక్‌పేట డివిజన్లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 15లో తాము ఓటు వేసేందుకు వచ్చామని, తీరా చూస్తే తమ ఓటు లేదని చెబుతున్నారన్నారు. కొన్ని కుటుంబాల్లో చాలా ఓట్లు లేవని పేర్కొన్నారు. 20 రోజుల క్రితం చెక్ చేసుకున్నప్పుడు ఉన్న ఓట్లు, ఇప్పుడు చూస్తే లేవని వాపోయారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినట్లు ఓటర్లు తెలిపారు. బతికున్న వారి ఓట్లు తీసేసి, చనిపోయిన వారి ఓట్లను చేర్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఓట్లు ఎలా గల్లంతయ్యాయో తెలపాలని అధికారులను వివరణ కోరితే, వారి వద్ద కూడా సమాధానం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓటర్లు మండిపడుతున్నారు. వెంటనే తమకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. షేక్‌పేట నుంచి గల్లంతైన ఓట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు.
ఓటర్లతో మాట్లాడిన కిషన్ రెడ్డి : షేక్‌పేట్‌లో ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తమ ఓట్లు గల్లంతు కావడంతో ఆందోళనకు దిగిన ఓటర్లతో ఆయన మాట్లాడారు. షేక్‌పేట్ డివిజన్లో దాదాపు 3వేల ఓట్లను డిలీట్ చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారని ఇప్పుడేమో డిలీట్ అయ్యాయని చెప్తున్నారన్నారు. కేవలం ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపీకి వ్యతిరేకంగా అధికారులు ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం కిందట ఓటర్ స్లిప్లను పంచారు. ఇప్పుడు లిస్ట్ లో ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయన్నారు. అధికారులు కావాలనే ఓట్లను డిలీట్ చేశారన్న కేంద్రమంత్రి దీనిపై పోరాడామని తెలిపారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశానట్లుగా వెల్లడించారు. దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయబోతున్నామని స్పష్టం చేశారు.