మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహం - వీడియో వైరల్ - Traffic Police Attack on man
Published : Jul 26, 2024, 6:16 PM IST
Traffic Police Attack On Man : మద్యం సేవించి వాహనం నడిపాడని ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల ప్రాంతానికి చెందిన మహేష్ ఈ నెల 22న స్నేహితులతో కలిసి మద్యం సేవించి కారు నడుపుతూ శంకర్‌పల్లివైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సీఐ వెంకటేష్ సిబ్బందితో కలిసి డ్రంక్అండ్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
మహేష్ కారును ఆపి పరీక్ష చేయగా అధికశాతం ఆల్కహాల్ తాగినట్లుగా తేలింది. వాహనం దిగాలని ట్రాఫిక్ సిబ్బంది అతడిని సూచించడంతో కారు దిగిన మహేష్ తెలిసిన వారికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో పారిపోతున్నావా అంటూ సీఐ, ఇతర సిబ్బంది అతడిని వెంబడించి చొక్కా పట్టుకొని తన్నుకుంటూ రోడ్డుపైకి తీసుకువచ్చారు. దీన్ని అక్కడే ఉన్న మహేష్ స్నేహితులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు వారి ఫోన్లు లాక్కొని చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసులు యువకుల నుంచి ఫోన్లు తీసుకోకముందే ఇతర ఫోన్లకు పంపించడంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ట్రాఫిక్ సీఐ వెంకటేశ్ స్పందించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా పట్టుబడిన మహేష్ అనే వ్యక్తి తమ విధినిర్వహణకు ఆటంకం కలిగించినందున కేసు నమోదు చేశామన్నారు. తమ నుంచి యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా తీసుకొచ్చామే తప్ప దురుసుగా ప్రవర్తించలేదని వెల్లడించారు.