'వైసీపీలో మా తండ్రికి అవమానం - అందుకే రాజీనామా చేశాం' - Corporators Resigned From YSRCP - CORPORATORS RESIGNED FROM YSRCP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 5:33 PM IST
Corporators Resigned From YSRCP: వైసీపీలో తమకు సముచిత ప్రాధాన్యత దక్కలేదంటూ తిరుపతి నగరపాలక సంస్ధ 48, 49వ డివిజన్ కార్పొరేటర్లు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో నగరపాలక కార్పొరేటర్లు అనిత యాదవ్, సంధ్య యాదవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ డివిజన్ పరిధిలో తాము ప్రతిపాదించిన వారిని వాలంటీర్లుగా నియమించుకోలేకపోయామని తెలిపారు. వాలంటీర్ల నియామకాలకు ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి తాము ఎదుర్కొన్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వకపోయినా పట్టించుకోలేదని వెల్లడించారు.
రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తమ తండ్రి వైసీపీ నుంచి బయటకు వచ్చారని తెలిపారు. అందుకు ఆయనను దూషిస్తూ మాట్లాడం సరికాదన్నారు. మా నాన్న తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వైసీపీ నుంచి తాము వైదొలుగుతున్నట్లు వారు తెలిపారు. మాట్లాడింది మా వాళ్లు అయినా మాట్లాడించింది వేరే వాళ్లని పేర్కొన్నారు. తాము పార్టీ నుంచి బయటకు రావాలని అనుకోలేని తెలిపారు. తమ తండ్రి బయటికి వచ్చి మాట్లాడితే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పదవులు ఆశించి పార్టీని వీడటం లేదని తెలిపారు. మరో పార్టీకి వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. గురివింద గింజకు తన రంగు తెలియనట్లు వైసీపీ నేతలు మాట్లాడారని విమర్శించారు.