LIVE : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - Telangana Praja Palana Day 2024
Published : Sep 17, 2024, 9:33 AM IST
|Updated : Sep 17, 2024, 10:27 AM IST
Telangana Praja Palana Day Under Congress Govt Live : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సెప్టెంబరు 17కు కొత్త ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో ఉత్సవాలను నిర్వహిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేర్వేరు పేర్లతో ఈ వేడుకలను జరుపుకుంటున్నాయి. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో కలిసినందున విలీన దినోత్సవమని కొన్ని పార్టీలు, నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించినందున విమోచనా దినోత్సవమని మరికొన్ని పార్టీలు జరుపుకుంటున్నాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచనా దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించగా, నాడు కేసీఆర్ సర్కార్ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో నిర్వహించింది. నూతన తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఒకే ఘట్టానికి విభిన్న ఆలోచనలతో వేర్వేరు నిర్వచనాలు ఇస్తూ పార్టీలు, ప్రభుత్వాలు సెప్టెంబరు 17 వేడుకలను పోటాపోటీగా జరుపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెక్రటేరియట్లో ఈ వేడుకలను ప్రారంభించగా, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు జిల్లా కేంద్రాల్లో (కలెక్టర్ కార్యాలయాల్లో) పాల్గొంటున్నారు. ఈ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెప్టెంబరు 17 ప్రాముఖ్యతను వివరించారు. విలీనం, విమోచనం, విముక్తి, విద్రోహం, ఇలాంటి ఆలోచనలతో సంబంధం లేకుండా ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో మెరుగైన పాలన అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నది.
Last Updated : Sep 17, 2024, 10:27 AM IST