జగన్ మాటలను ఆయన తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదు: తెలంగాణ సీఎం రేవంత్ - Revanth Reddy Counter To CM Jagan - REVANTH REDDY COUNTER TO CM JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 12:33 PM IST
Telangana CM Revanth Reddy Counter To CM Jagan Comments : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటలను ఆయన తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మనిషంటూ శుక్రవారం జగన్ కడపలో చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన 'మీట్ ద ప్రెస్'లో రేవంత్ మాట్లాడారు.
జగన్ మాటలను కన్నతల్లి, సొంత చెల్లి నమ్మడం లేదని, సొంత చిన్నాన్నకు జరిగిన పరిస్థితి, అక్కడి వాతావరణాన్ని వాళ్లు ఈ ఎన్నికల్లో చెబుతున్నారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలకు విలువ లేదని కొట్టి పారేశారు. ముందుగా తన తల్లి, చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని జగన్‌కు సూచించారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రినని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబుతో తనకు రాజకీయ సంబంధాలు లేవని మరోసారి తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తానని, ఏపీలో షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.