తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయ్‌ను చంపించిన నిందితులను జగన్ కాపాడుతున్నాడు: బాలకృష్ణ - Balakrishna Campaign in Kurnool - BALAKRISHNA CAMPAIGN IN KURNOOL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 7:27 AM IST
TDP Leader Balakrishna Fires on CM Jagan: ఓటుతో వైసీపీకు బుద్ధి చెప్పాలని, జగన్‌ను గద్దెదించాలని ప్రజలకు తెలుగుదేశం నేత నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. అరాచకం కావాలా అభివృద్ధి కావాలా సమర్థ పాలన కావాలా రాక్షస రాజ్యం, చీకటి పాలన కావాలా అన్న విషయాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా కర్నూలులో పర్యటించారు. దళితులకు అండగా ఉంటానంటూనే వారి చావులకు జగన్ కారణమయ్యారని బాలకృష్ణ మండిపడ్డారు. ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని వివరించారు.
Balakrishna Meeting in Kurnool: కర్నూలులో బాలకృష్ణ చిన్న అమ్మవారిశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో నిర్వహించారు. బాలకృష్ణను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడుగడుగునా బాలకృష్ణకు పూలదండలు వేస్తూ స్వాగతం పలికారు. జగన్ మాటల మాంత్రికుడని మాట తప్పనని రాష్ట్రాన్ని మంటగలిపి జలగలా పీడిస్తున్నారని బాలకృష్ణ ఆరోపించారు. చెల్లిని, తల్లిని తరిమేసిన జగన్ బాబాయ్‌ను చంపించిన నిందితులను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు.