వైసీపీకి పోలీసు వ్యవస్థ కొమ్ము కాస్తోంది - డీజీపీని విధుల నుంచి తప్పించాలి: బుద్ధా వెంకన్న - BUDDHA COMMENTS ON DGP - BUDDHA COMMENTS ON DGP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 12:51 PM IST
TDP Buddha Venkanna on Election Code: ఎన్నికల కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ము కాస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రదారులపై 24 గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా అని నిలదీశారు.
లోకేశ్ అంటే ప్రభుత్వానికి భయం కాబట్టే అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళగిరిలో లోకేశ్‌ని ఓడించటానికి రూ.500 కోట్లు సిద్ధం చేసుకున్నారని అన్నారు. పోలీసు ఎస్కార్ట్‌తో నల్ల డబ్బును సాక్షి వాహనాల్లో రాష్ట్ర మంతటా పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ వాడే డబ్బంతా ప్రజలదేనని తెలిపారు. ఓటుకు 30 వేలైనా మంగళగిరిలో పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బుని ఇప్పుడు పంచుతున్నాడని దుయ్యబట్టారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్‌కి వేయాలని బుద్దా వెంకన్న కోరారు.