కంటిమీద కునుకులేకుండా చేస్తున్న గోదావరి వరద- నీళ్లలో నానుతున్న ఇళ్లు, పొలాలు - heavy rains in Konaseema district - HEAVY RAINS IN KONASEEMA DISTRICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 5:40 PM IST
Shivai Lanka People Suffering due to Heavy Rains : గోదావరి వరదలు కోనసీమ జిల్లాలోని శివాయిలంక ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్ల చుట్టూ భారీగా వరద చేరడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. దవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు వరద రావడంతో పంట పొలాలన్నీ నీట మునిగి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మరబోట్లు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో, నాటు పడవలను మాత్రమే ఉపయోగిస్తున్నామని స్ఖానికులు తెలిపారు. గర్భిణులు చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కూలుకు వెళ్లాల్సిన పిల్లలు సైతం వరద నీటిలో వెళ్లలేక ఇంటివద్దనే ఉంటున్నారని తెలిపారు.
పొలాలు ముంపు బారిన పడటంతో పంటలు నీటిలో నానుతున్నాయని వెల్లడించారు. ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయన్నారు. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.