సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనా? : షబ్బీర్ అలీ - Shabbir Ali Latest News
Published : Feb 1, 2024, 8:25 PM IST
Shabbir Ali visited Kamareddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారునిగా నియమాకం అయిన తర్వాత కామారెడ్డి జిల్లాలో తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దేశంలో ఉన్న మైనార్టీలకు బడ్జెట్లో భారీగా నిధులు కుదించారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలపై చిన్న చూపుతో స్కాలర్షిప్ తగ్గించారని అలీ పేర్కొన్నారు. మోదీ సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్ అంటే బడ్జెట్ కేటాయింపులు తగ్గించడమేనా అని షబ్బీర్ ప్రశ్నించారు.
Shabbir Ali Fires On KTR : కేంద్ర బడ్జెట్ నిరాశకు గురి చేసిందని షబ్బీర్ అలీ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు రాదని, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం రాష్టాన్ని లూటీ చేసిందని, రెండు నెలలు కాకముందే తమపై విమర్శలు చేయడం తగదని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని, త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేస్తామని అలీ స్పష్టం చేశారు.