పూల పండుగ కోసం అమెరికాలో ఒక్కటైన తెలుగు మహిళలు
Published : Oct 7, 2024, 10:04 PM IST
Bathukamma Celebrations In America : అంతర్జాతీయ బతుకమ్మ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అమెరికా వర్జీనియా రాష్ట్రం రిచ్మండ్ నగరంలో గ్రేటర్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 700 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి సంప్రదాయ వస్త్రాలు ధరించిన మహిళలు, చిన్నారులు సంతోషంగా బతుకమ్మ చుట్టు తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుక సాంప్రదాయబద్ధంగా ఉత్సాహభరితంగా సాగింది. బతకుమ్మ పాటలు పాడుకుంటూ సంబరంగా గడిపారు.
జన్మభూమికి దూరంగా ఉంటున్న వీరికి ఈ వేడుక ఆనందం, ఐక్యత తీసుకొచ్చినట్లైంది. బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళలకు అసోసియేషన్ వారు బహుమతులు అందించారు. ప్రతి సంవత్సరం దసరా, బతుకమ్మ సంబరాలు అమెరికాలో ఘనంగా నిర్వహించుకోవడం తమకు అనవాయితీగా వస్తుందని గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ కందుల తెలిపారు. దసరా, దీపావళి వేడుకలను కూడా ఘనంగా జరుపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు.