'ఎక్కడికీ వెళ్లొద్దు మేడం - ఇక్కడే ఉండండి' - టీచర్ల బదిలీ - విద్యార్థుల కంటతడి - Students Cried For Teacher Transfer
Published : Jul 4, 2024, 12:52 PM IST
Students Became Emotional For Teachers Transfer : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో విద్యార్థులు టీచర్లను వెళ్లొద్దంటూ కంటితడి పెడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలోని శివంపేట మండలం రత్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల చుట్టుముట్టి ఎక్కడికీ వెళ్లొద్దు ఇక్కడే ఉండాలంటూ విద్యార్థులు బోరున విలపించారు. గత 13 సంవత్సరాలుగా రత్నాపూర్ ప్రాథమిక పాఠశాలలో జ్యోతి, శ్రీవాణి, పరమేశ్వరి, కృష్ణ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇటీవల వారు బదిలీ అయ్యారు.
School Students Emotional in Medak : అయితే బదిలీపై వీరు పాఠశాల నుంచి వెళుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు, ఒక్కసారిగా ఉపాధ్యాయులను పట్టుకుని కంటతడిపెట్టారు. విద్యార్థులను బుజ్జగిస్తూ టీచర్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. అలా ఉండడం సాధ్యం కాదని, కొత్త టీచర్లు వస్తారని, బాగా చదువుకోవాలని నచ్చజెప్పారు. అయినా ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లడంతో ఏం జరిగిందంటూ తల్లిదండ్రులు ఆరా తీశారు. టీచర్ల బదిలీ విషయం చెప్పడంతో వారు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.