ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మైనింగ్ దందా ₹5వేల కోట్లు: సమతా సైనిక్ దళ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 7:40 PM IST
Five Thousand Crores Of Illegal Mining YSRCP Representatives: ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధులు 5వేల కోట్ల అక్రమ మైనింగ్ దందా సాగుతోందని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుచరులు తలశిల రఘురామ్, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఆధ్వర్యంలోనే మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో ఫిర్యాదు చేస్తే ఓ బృందం తనిఖీలు చేపట్టి ఎన్జీటీకి గతంలో నివేదిక ఇచ్చిందన్నారు. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని పోలీసులు, ఫారెస్ట్ అధికారులను ఎన్జీటీ గతంలో ఆదేశించిందని తెలిపారు.
ట్రిబ్యునల్, అధికారుల ఆదేశాలను పోలీసులు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా నిత్యం అక్రమ మైనింగ్ కొనసాగిస్తూ బేఖాతరు చేస్తున్నారని మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 వేల కోట్ల రూపాయల మేర అక్రమ మైనింగ్ జరిగిందంటే రాష్ట్రం మెుత్తం మీద ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగిందో ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని అవినీతి పెత్తందారీ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని సమతా సైనిక్ దళ్ టీమ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది.