ప్రమాదాలకు నిలయంగా చిట్టినగర్ సొరంగం - కొండపై నుంచి జారిపడుతున్న రాళ్లు - Chittinagar Tunnel Dangerous - CHITTINAGAR TUNNEL DANGEROUS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 3:16 PM IST
Rocks Falling from Hill At Vijayawada Chittinagar Tunnel : విజయవాడలోని సొరంగ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఆ మార్గంలో ఎప్పుడు ఏ బండరాయి మీద పడుతుందో తెలియదు. వర్షాకాలం వచ్చిందంటే కొండపై నుంచి వచ్చే వరద నీటితో భయం భయంగానే బండి నడపాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. కేరళలోని వయనాడ్లో జరిగిన సంఘటనను తలచుకోని భయపడుతున్నారు.
ప్రస్తుతం విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న చిట్టినగర్ సొరంగ దారిలో కొండపై నుంచి రాళ్లు జారిపడుతున్నాయి. దీంతో సొరంగం నుంచి వెళ్తున్న వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సొరంగం లోపల ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. సొరంగం వద్ద అనేక సార్లు రాళ్లు జారి పడి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొరంగ మార్గానికి ఆనుకొని గృహాలు ఉండటంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనతో బతుకుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే దడపుడుతోందని అంటున్నారు.