ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు - జిల్లా కేంద్రాల్లోనూ 'హైడ్రా' లాంటి వ్యవస్థలు : పొంగులేటి - Ponguleti On Hydra Performance - PONGULETI ON HYDRA PERFORMANCE
Published : Aug 18, 2024, 3:45 PM IST
|Updated : Aug 18, 2024, 4:34 PM IST
Minister Ponguleti On Hydra Performance : అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో హైడ్రా పనితీరు భేష్‌గా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు వెల్లడించిన మంత్రి పొంగులేటి, ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో తానైనా, తన కుటుంబ సభ్యులైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఒకే విధమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఈ దూకుడు మూన్నాళ్ల ముచ్చట అసలే కాదని, ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని వెల్లడించారు. హైడ్రా పనితీరును ప్రశంసించిన ఆయన, ఇదే రీతిలో జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో షో పాలిటిక్స్ చేయాలని కానీ, కోట్లాది రూపాయల అప్పు తీసుకుంటూ తమది ధనిక రాష్ట్రమని చెప్పుకోవాలన్న ఉద్దేశం కానీ తమ ప్రభుత్వానిది లేదని అన్నారు.