మూడు రోజులుగా జలదిగ్బంధంలో కాలనీవాసులు - ఈటీవీ భారత్ కథనానికి కదిలివచ్చిన అధికారులు - Rain Water Entered into Colony
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 4:53 PM IST
|Updated : May 27, 2024, 6:05 PM IST
Rain Water Entered into Colony: అనంతపురం జిల్లా ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద హమాలీ కాలనీవాసులు ధర్నా చేపట్టారు. ఉరవకొండ పట్టణంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలనీలో ఉన్న ఇళ్ల వద్ద భారీగా నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నీరు చేరడంతో హమాలీ కాలనీ పరిసరాలు మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నామని వాపోయారు. ఇళ్ల చుట్టూ వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షపు నీరు ముందుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని మూడు రోజులుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులతో కలసి బాధితులు ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మూడు రోజులుగా వర్షపు నీరు ఇళ్ల చుట్టూ ఉండడంతో పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు.
మూడు రోజులుగా జల దిగ్భంధంలో ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఈటీవీ - ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథానానికి అధికారులు స్పందించారు. వెంటనే అక్కడికి చేరుకుని వర్షపు నీరు పోవడానికి చర్యలు చేపట్టారు. ఈటీవీ - ఈటీవీ భారత్లో ప్రసారం కావడంతోనే అధికారులు స్పందించారని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.