క్లాస్‌రూంలో వర్షపు నీరు - గొడుగులతో పాఠాలు వింటున్న విద్యార్థులు - Rain in Classroom in Govt School - RAIN IN CLASSROOM IN GOVT SCHOOL
Published : Jul 24, 2024, 5:22 PM IST
Rain in Classroom in Mancherial : విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవాలంటే మంచి వాతావరణంతో పాటు అక్కడి భౌతిక పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. కానీ ఓ పాఠశాలలో మాత్రం గొడుగులతోనే చదువు కొనసాగించాల్సి వస్తుంది. గొడుగులే చదువుకు ఆధారమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులు సమస్యల నడుమ విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పైకప్పు వెంట వర్షపు నీరు తరగతి గదిలోకి వచ్చి చేరుతున్నాయి.
మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం శూన్యం : పాఠశాలలోని ఎనిమిదో తరగతి గదిలో వర్షపు నీరు ఎక్కువగా పడుతుండటంతో 11 మంది ఉన్న విద్యార్థులు గొడుగులు చేతబూని పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు సైతం గొడుగులతోనే పాఠాలు బోధిస్తున్నారు. గతంలో మన ఊరు మనబడి ప్రణాళికలో భాగంగా 2 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించి పాఠశాలలోని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.