పరిహారం వెంటనే చెల్లించాలి - ఓఎన్‌జీసీ కార్యాలయం వద్ద మత్స్యకారుల ఆందోళన - Protests at ONGC office
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 9:50 PM IST
Protest of Fishermen in ONGC Office : ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఓఎన్‌జీసీ(ONGC) సంస్థ మత్స్యకారులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలంటూ ఓఎన్‌జీసీ కార్యాలయం వద్ద మత్స్యకారులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. యానాంకు చెందిన 5462 మత్స్యకార కుటుంబాలకు, 24 నెలలకు సంబంధించి పరిహారంగా రూ. 135 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి ప్రభుత్వం తయారు చేసిన అర్హులైన మత్స్యకారుల జాబితా ప్రకారం 24 నెలలకు చెల్లించాల్సిన పరిహారాన్ని కాలయాపన చేయకుండా తక్షణమే విడుదుల చేయాలని కోరారు. ఓఎన్‌జీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలోని 64 మత్స్యకార గ్రామాల వారికి ఇప్పటికే నాలుగు విడతలుగా పరిహారాన్ని అందించారని గుర్తు చేశారు.
కానీ, యానాం విషయంలో మాత్రం ఎందుకు వాయిదాలు వేస్తున్నారని మండిపడ్డారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లారెడ్డి కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. ఓఎన్‌జీసీ చమురు సంస్థ ఈ నెలాఖరులోగా పరిహారం చెల్లించకుంటే కార్యాలయం ఎదుట రోజువారి నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశానికి పెద్దఎత్తున మత్స్యకారులు హాజరుకావడంతో చమురు సంస్థ వద్ద ఆంధ్రా, యానాం పోలీసులు భారీగా మోహరించారు.