వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు - Protests against YCP MLA candidate
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 5:52 PM IST
Protest against Venkatagiri YCP MLA candidate: తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ అసంతృప్తి నేతలు భారీ నిరసన ర్యాలీ చేశారు. వెంకటగిరి అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే తాము ప్రత్యామ్నాయాన్ని చూసుకోక తప్పదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ్ రెడ్డి నేతృత్వంలో వెంకటగిరిలో ఆదోళన కార్యక్రమాలు జరిగాయి. పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించిన అనంతరం వైసీపీ నేతలతో ధనుంజయ్ రెడ్డి ఓ కల్యాణ మండపంలో కార్యకర్తలు, నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు.
వెంకటగిరిలో వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి పార్టీలోని నాయకులు, కార్యకర్తలను విస్మరించారని తెలిపారు. స్వంత పార్టీ నేతలపై కేసులు పెట్టారని వెల్లడించారు. పార్టీ కోసం పని చేసే వ్యక్తులు రామ్ కుమార్ వెంట లేరని తెలిపారు. స్థానిక సమస్యలపై స్పందించని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవలేరని జోష్యం చెప్పారు. రామ్ కుమార్ రెడ్డి స్వంత బలగాన్ని తయారు చేసుకొని పరిపాలన సాగించారని తెలిపారు. రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిస్తే వెంకటగిరిలో వైసీపీ గెలవడం కష్టమని ధనుంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ భాస్కర్ రావు, బాలాయపల్లి ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పెంచలకోన ఆలయ కమిటీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి, ఆరు మండలాలకు సంబంధించిన పలువురు నేతలు పాల్గొన్నారు.