పదిహేనేళ్ల పిల్లలే కానీ 12 బైకులు కొట్టేశారు - జల్సాలకు అలవాటు కావడమే కారణం - Two wheeler thefts in Vizianagaram
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 12:49 PM IST
Police Recovered 12 Two Wheelers in Vizianagaram : పదిహేను సంవత్సరాల బాలుడు చెడు వ్యసనాలకు బానిసై చదువుకు దూరం అయ్యాడు. ఈ క్రమంలో సినిమాలకు వెళ్లేందుకు సాయంత్రం సమయాల్లో స్నేహితులతో తిరిగేందుకు ద్విచక్ర వాహనాలను దొంగిలించడం అలవాటుగా చేసుకున్నాడు. మరో ఇద్దరితో పరిచయం పెంచుకుని చోరీలకు పాల్పడేవాడు. అనంతరం వాటిని తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకునేవాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
దొంగిలించిన వాహనాలతో జల్సాలు : ఈ కేసు వివరాలను డీఎస్పీ గోవిందరావు ఒకటో పట్టణ స్టేషన్‌లో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(15) చదువు మానేసి చిన్నపాటి దొంగతనాలు చేసేవాడు. రణస్థలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన మరో బాలుడితో పరిచయం ఏర్పడింది. వీరందరికి ద్విచక్ర వాహనాలంటే విపరీతమైన ఇష్టం. దీంతో అవకాశం ఉన్నచోట బైక్‌లను చోరీ చేసి, వాటిపై తిరుగుతూ గడిపేవారు. కొన్ని రోజుల పాటు తిరిగి, అనంతరం తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఆయన తెలిపారు.
బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ : బైకు దొంగతనాలు జరిగినట్లు పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసుల రంగంలోకి దిగారు. విజయనగరం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, రెండో పట్టణం, పూసపాటిరేగ, భోగాపురం, రణస్థలం, భీమిలి ప్రాంతాల్లో 12 బైక్‌లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈనెల 29న నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నేరం ఒప్పుకోవడంతో బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించామని డీఎస్పీ గోవిందరావు తెలపారు. దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సీఐ బి.వెంకటరావు, ఎస్సై జె.తారకేశ్వరరావు, హెచ్‌సీ ఎం.అచ్చిరాజు, పీసీలు టి.శ్రీనివాసరావు, పి.శివశంకర్, ఎన్.గౌరీశంకర్, బి.భాస్కరరావును డీఎస్పీ అభినందించారు.