కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం - ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్ - ఉప్పల్లో గంజాయి చాక్లెట్ విక్రయం
Published : Jan 28, 2024, 6:11 PM IST
Police Caught Ganja Chocolates in Uppal : హైదరాబాద్లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంలో విక్రయిస్తున్న దుకాణంపై నిఘా పెట్టిన పోలీసులు, ఆకస్మికంగా దాడి నిర్వహించి కిలో గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ఫిరోజ్ జెనా అలియాస్ రవిగా గుర్తించిన పోలీసులు అతడి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా 35 కిలోల గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి.
అతన్ని విచారించిన పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. ఉపాధి కోసం హైదరాబాద్ ఉప్పల్ పారిశ్రామిక వాడకు వచ్చి ఫిరోజ్ కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గంజాయితో తయారు చేస్తున్న చాక్లెట్ను రూ.2కు కొనుగోలు చేసి కార్మికులకు, విద్యార్థులకు రూ.10 చొప్పున విక్రయిస్తున్నాడు. గత ఆరు నెలలుగా గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు ఫిరోజ్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇవి అచ్చం పిల్లలు తినే చాక్లెట్లను పోలి ఉన్నాయని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య తెలిపారు.