పోలీసులంతా కలిసి కొట్టారు: జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు కిరణ్ - POLICE ATTACK ON JC FOLLOWER - POLICE ATTACK ON JC FOLLOWER
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 11:57 AM IST
Police Attack on JC Prabhakar Reddy Follower in Tadipatri : తాడిపత్రిలో గొడవలను అదుపు చేయాల్సిన పోలీసులు మరింత ఆజ్యం పోస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పని చేసే దివ్యాంగుడు దాసరి కిరణ్‌ను బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు డీఎస్పీ చైతన్య ఆదేశాలతో విచక్షణారహితంగా కొట్టారు. లాఠీలతో చావబాదడంతో కిరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కిరణ్ తలకు బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని తనను డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కొట్టడం దారుణమని బాధితుడు కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పోలింగ్ రోజునే తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. టీడీపీ ఏజెంట్ల, కార్యకర్తలపై దాడులకు తెగబడి భయాందోళన సృష్టించారు. అంతటితో ఊరుకోక మంగళవారం రాత్రి సైతం తాడిపత్రిలో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా అందర్నీ భయకంపితులను చేశారు. కేతిరెడ్డి అరాచలను కట్టడి చేయల్సిన పోలీసులు ఆయనకు వంత పాడుతున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
రాత్రి ఒంటిగంటకు ఇద్దరు, ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చారు. డీఎస్సీ చైతన్య పిలుస్తున్నారు.. రావాలన్నారు. పోలీసులు పిలవగానే వారితో పాటు వెళ్లా. అప్పటికే మావాళ్లందరిని గ్రౌండ్‌లో కొట్టి బస్సు ఎక్కిస్తున్నారు. నేను బస్సు ఎక్కడానికి వెళ్తున్న సమయంలో చైతన్య కొట్టారు. చైతన్యతో పాటు పోలీసులంతా కలిసి నన్ను కొట్టారు. పోలీసులు దాడిచేస్తుంటే చేతులు విరిగాయని చెప్పా. బస్సు ఎక్కాలని పరుష పదజాలంతో దూషించారు. బస్సు దిగగానే టౌన్ సీఐ నన్ను చూసి దెబ్బలు ఎలా తగిలాయన్నారు. నన్ను ప్రభుత్వాస్పత్రికి టౌన్ సీఐ తీసుకొచ్చి వదిలిపెట్టారు. టౌన్ సి.ఐ. తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. -దాసరి కిరణ్, బాధితుడు