పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు కొంటున్నారా? అవి నకిలీవేమో ఓసారి చెక్ చేసుకోండి
Published : Jan 23, 2024, 6:41 PM IST
Pochampally Ikkat Pattu Fake sarees : నకిలీ. వస్తువుల నుంచి చీరలకూ పాకింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోచంపల్లి పట్టు చీరలకూ నకిలీ బెడద తప్పలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని టెక్స్టైల్స్ దుకాణాల్లో స్టేట్ లెవల్ ఎన్ఫోర్స్మెంట్, హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పోచంపల్లి పట్టు చీరల పేరుతో నకిలీ చీరలు అమ్ముతున్నారనే ఫిర్యాదు మేరకు పలు దుకాణాలను తనిఖీ చేశారు.
15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సుమారు 15 దుకాణాలను పరిశీలించారు. ఆయా దుకాణాల్లో మొత్తం 30కి పైగా చీరలను నకిలీవిగా గుర్తించారు. ఈ మేరకు షాపుల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి, ఇక్కత్ చీరలుగా అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నకిలీ చీరలతో చేనేత కార్మికులు నష్టపోతున్నారని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.