మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం - పశువుల కాపరులు ఒంటరిగా తిరగొద్దని పోలీసుల హెచ్చరిక - Leopard Wandering in Medak District
Published : Jul 6, 2024, 12:12 PM IST
Leopard Wandering at Nagpur in Medak District : మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం ఒక్కసారిగా స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ గేటు వద్ద కారులో వెళుతున్న ప్రయాణికులకు చిరుత పులి కనిపించింది. దీంతో వెంటనే వారు తమ సెల్ ఫోన్లో వీడియోలు తీసి పోలీసులకు పంపించారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
చిరుత పులి సంచారం కొత్తేమీ కాదంటున్న స్థానికులు : గతంలో కూడా మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుత పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు పశువులపై కూడా దాడి చేసిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. స్థానికులు ఒంటరిగా రాత్రివేళ తిరగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పొలాలకు వెళ్లే సమయాల్లో జాగ్రత్త పాటించాలన్నారు. ప్రధానంగా పశువుల కాపరులు ఒంటరిగా పశువులను మేపడానికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ గుంపులుగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.