How to Make Makhana Gunta Ponganalu: హెల్దీ స్నాక్ ఐటమ్స్‌లో తామర గింజలు ముందు వరుసలో ఉంటాయి. ఫూల్ మఖానాగా పిలుచుకునే ఈ గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు బరువు తగ్గడంతో సహా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే మఖానాతో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు. ఖీర్, మసాలా కర్రీ, రైతా ఇలా ఎన్నో చేసి ఉంటారు. అయితే, కేవలం ఇవి మాత్రమే కాకుండా మఖానాతో గుంత పొంగనాలు కూడా చేయొచ్చు. ఇవి రుచిగానూ ఉండటంతో పాటు, ఆరోగ్యం కూడా. పైగా బ్రేక్‌ఫాస్ట్‌కు సూపర్ ఆప్షన్. మరి, కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
- రవ్వ - కప్పు
- ఫూల్‌మఖానా - కప్పు
- పనీర్ - అర కప్పు
- పెరుగు - పావు కప్పు
- బంగాళదుంప -1
- క్యాప్సికం -1
- క్యారెట్లు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా,
- ఉప్పు - రుచికి తగినంత
- మిరియాల పొడి - అర చెంచా
- నిమ్మరసం - అర చెంచా
- జీలకర్ర - చెంచా
- పచ్చిమిర్చి తరుగు - చెంచా
- ఇంగువ - చిటికెడు
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం:
- బంగాళదుంపను ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. క్యారెట్‌ను తురమాలి. అలాగే పనీర్‌ను కూడా తురుముకోవాలి. క్యాప్సికంను సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రవ్వ, ఫూల్ మఖానాలను విడివిడిగా వేయించాలి. చల్లారిన తర్వాత రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఓ బౌల్లోకి తీసుకోవాలి.
- అందులోకి మిరియాల పొడి, పెరుగు, క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, పనీర్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, ఇంగువ, బంగాళదుంప ముద్ద జతచేసి.. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలిపి పక్కనుంచాలి. మామూలుగా గుంతపొంగనాల కోసం చేసే పిండి దోశ పిండిలా జారుగా ఉంటుంది. ఇది మాత్రం గట్టిగా ఉండాలి.
- పావుగంట నానిన తర్వాత నిమ్మరసం, ఉప్పు వేసి మరోసారి కలపాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాల పెనం పెట్టి నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత రవ్వ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి కాల్చుకోవాలి.
- ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కాలనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని పొంగనాలుగా వేసుకోవాలి.
- వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేయొచ్చు. ఇవి పిల్లలూ పెద్దలూ అందరికీ నచ్చుతాయి. లంచ్‌బాక్స్‌లోకి కూడా బాగుంటాయి.
గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్ ఎంజాయ్ చేయండి