మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్ - చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్లో నిర్మించిన గోడ కూల్చివేత - Illegal Constructions demolished - ILLEGAL CONSTRUCTIONS DEMOLISHED
Published : May 24, 2024, 7:17 PM IST
Mallareddy Illegal Construction Demolished : బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి మల్లారెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం బొమ్మరాశిపేట పెద్ద చెరువులోని ఫుల్ట్యాంక్ లెవెల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపించారు. చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బొమ్మరాశిపేట గ్రామంలోని పెద్ద చెరువు శిఖరంలో 7 ఎకరాలు మల్లారెడ్డి ఆధీనంలో ఉంది. ఇందులో కొంత మేర చెరువు ఎస్టీఎల్ పరిధిలో ఉండడంతో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం అందులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జేసీబీ యంత్రాలతో కూల్చివేశారు. ఈ మేరకు అక్రమంగా చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్లో నిర్మాణాలు చేపట్టవద్దని పలుమార్లు చెప్పినా, నోటీసులు ఇచ్చినా స్పందించకుండా గోడ పెట్టడం చట్ట వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.