₹50 కోట్ల ప్రభుత్వ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ - పురపాలక ఆస్తుల అన్యాక్రాంతంపై నంద్యాల కౌన్సిల్ సభలో రసాభాస - పురపాలక ఆస్తులు అన్యాక్రాంతం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 1:31 PM IST
Municipal Council meeting Nandyala District : అధికారుల నిర్లక్ష్యం వల్లే నంద్యాల పట్టణంలోని పురపాలక ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని అధికార, విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలక పరిధిలోని 2.30 ఎకరాల స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణ మని ధ్వజమెత్తారు. ఛైర్పర్సన్ షేక్ మాబున్నిసా అధ్యక్షతన గురువారం నంద్యాల పురపాలక కౌన్సిల్ సమావేశం (Municipal Council meeting) జరిగింది. మొదట అజెండాలోని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పలువురు సభ్యులు తమ వార్డుల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
Land Issue in Nandyala Municipal : టీడీపీ (TDP) ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి, వైస్ చైర్మన్ పాంషావలి, 12వ వార్డు కౌన్సిలర్ శ్యాంసుందర్లాల్ మాట్లాడుతూ సుమారు రూ.50 కోట్ల విలువైన 2.30 ఎకరాల స్థలానికి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఛైర్పర్సన్ షేక్ మాబున్ని సా మాట్లాడుతూ పురపాలక ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సెంటు స్థలం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తానన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల విషయం తమకు తెలిసిన వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇందులో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని చెప్పారు.