దళితుల పట్ల కాంగ్రెస్ ముసలి కన్నీరు కారుస్తోంది : కె.లక్ష్మణ్ - MP Laxman Visit At Musheerabad
Published : Feb 4, 2024, 7:00 PM IST
MP Laxman Visit At Musheerabad : రాష్ట్ర రాజధానిలో పేదలు, బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో అభద్రతా భావం నెలకొందని రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ స్వామి వివేకానంద నగర్లో రెవెన్యూ, జీహెచ్ఎంసీ ఇటీవల 23 ఇళ్లను కూల్చివేసింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని లక్ష్మణ్, బీజేపీ నాయకులు వినయ్ కుమార్, రమేశ్ రాముతో పాటు పలువురు సీపీఎం నాయకులు సందర్శించి బాధితులను పరామర్శించారు. కోర్టు ఆదేశాల నెపంతో 70 ఏళ్లుగా నివాసముంటున్న స్థానికులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
Laxman Fires On Congress : దళితుల పట్ల ముసలి కన్నీరు కార్చే ఈ ప్రభుత్వం, రాజధాని నడిబొడ్డులో ఇళ్లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఈ సంఘటనతో అర్థమవుతోందన్నారు. ఎవరి కోసం ఈ చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.