ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి బడ్జెట్ కేటాయించలేదు : ఎమ్మెల్సీ కవిత - బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్
Published : Feb 14, 2024, 2:49 PM IST
MLC Kavitha In Council : మేడిపండు లాంటి బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, రాష్ట్రంలో ఇలాంటి బడ్జెట్‌ను ఇంతవరకు ఎన్నడూ చూడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. శాసనమండలిలో మాట్లాడిన కవిత, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ఉందని కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ యూత్ డిక్లరేషన్ మొదలు రైతుల పంటల బోనస్‌పై సరైన ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందన్న కవిత, ఈ ప్రభుత్వ బడ్జెట్ ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన పది శాతం కూడా బడ్జెట్‌లో కేటాయించలేదన్నారు.
MLC Kavitha on Six Guarantees Budget : "కాంగ్రెస్ నేతలు ప్రజా వాణి వినడం లేదు దిల్లీ వాణి వింటున్నారు. తెలంగాణ నుంచి బస్సులు పోతున్నాయి. తెలంగాణ ఎఐసీసీకి ఏటీఎమ్‌గా మారిపోయింది. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోవడం లేదు. 1.39 లక్షల మంది మహిళలకు రూ.2,500ల మందికి ఎప్పుడు ఇస్తారు. ఆడబిడ్డలకు లక్ష, తులం బంగారం ఊసే లేదు. ఉచిత గ్యాస్ సిలెండర్లపై స్పష్టత లేదు. ఎప్పుడు అమలు చేస్తారు. గృహజ్యోతి ప్రారంభిస్తాం అంటున్నారు దాని ఊసే లేదు. ఇందిరమ్మ ఇళ్లు పథకానికి కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే కేటాయించారు " అని కవిత మండిపడ్డారు.