సీఎంతో మాట్లాడి పోడు భూముల పట్టాలు ఇప్పిస్తా : మంత్రి సీతక్క
Published : Jan 28, 2024, 9:17 PM IST
Minister Seethakka visits Mulugu District : తనపై ఎంతగా ఆరోపణలు చేసినా, దుష్ప్రచారం చేసినా వాటన్నింటినీ నమ్మకుండా ఈ స్థాయికి చేరేలా అదరించిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ములుగు జిల్లాలో మంత్రి పర్యటించారు. రాణిగూడెం గ్రామంలో లోతట్టు గ్రామాల ప్రజలు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ములుగు మండలంలోని గుర్తూరు గ్రామంలో రూ.20 లక్షల వ్యయం చేసే గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ట్రైబల్ శాఖ ఉన్నందున ముఖ్యమంత్రితో మాట్లాడి పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ములుగు జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు రెండు పంటలకు నీరు అందేలా కృషి చేస్తామని, కాసింతవ్పేట గ్రామం నుంచి అంకనగడ్డ వరకు డబుల్ రోడ్డు వేయిస్తానన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తానని, ఇదే ప్రాంతంలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.