'సర్కారు బడులంటే చిన్నచూపు తగదు - ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు కృషి' - Minister Seethakka On Govt Schools
Published : Aug 8, 2024, 7:17 PM IST
Minister Seethakka On Govt Schools : సర్కారు బడులంటే చిన్నచూపు తగదని, ఇరుకు గదులుండే ప్రైవేటు పాఠశాలల కంటే విశాలమైన మైదానాలుండి, నాణ్యమైన విద్యనందించే ప్రభుత్వ బడులే మేలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదివారని తెలిపారు. బడి పిల్లల్లో దాగున్న సృజనను వెలికి తీసి, వారిని ప్రోత్సహించేందుకు ఏటా పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న బాలోత్సవ్ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన 125 స్కూళ్లలోని 7, 8, 9, 10వ తరగతి చదివే 675 మంది పిల్లలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాటం తీవ్రం చేస్తోందని సీతక్క తెలిపారు. ఈ బాలోత్సవ్ వేదికగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించడం మంచి విషయమని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో 25 ఎకరాల్లో కేజీ టు పీజీ విద్య అందించేందుకు సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే వారు పోరగాళ్లు కాదు, పోరాటాలు చేసే పోరుగాళ్లు అని ప్రముఖ కవి సుద్ధాల అశోక్ తేజ అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి, ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.