రాష్ట్రంలో బీసీ కులగణన జరిగాకే - స్థానిక సంస్థలకు ఎన్నికలు : మంత్రి పొన్నం - MINISTER PONNAM ON CASTE CENSUS - MINISTER PONNAM ON CASTE CENSUS
Published : Aug 18, 2024, 7:56 PM IST
MINISTER PONNAM ON CASTE CENSUS : రాష్ట్రంలో బీసీ కులగణన జరిగాకే, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. త్వరలోనే కులగణన చేపడతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ కులగణనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరునూరైనా కులగణన చేపడతామని పేర్కొన్నారు.
అసెంబ్లీలో కులగణనపై చర్చించి రూ.150 కోట్లు కేటాయించినట్లు పొన్నం తెలిపారు. కులగణనను ఏజెన్సీతో చేయించాలా? లేదా ప్రభుత్వంలోని ఏ శాఖకు అప్పగిస్తే బాగుంటుందని చర్చ జరుగుతుందని పొన్నం వెల్లడించారు. మరో వారం, పది రోజుల్లో కులగణన నిర్వహణకు సంబంధించిన స్పష్టత రాబోతుందని పేర్కొన్నారు. కులగణన ద్వారా వెనకబడిన వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు దక్కుతాయని, ప్రభుత్వం తరఫున కేటాయింపులు మరింత పెరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.